తిరుమలకు ఆగస్టు 14, 15 తర్వాత వెళ్తున్నారా.. మూడు రోజుల పాటూ రద్దు, టీటీడీ ప్రకటన

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. తిరుమల ఆలయంలో ఆగ‌స్టు 14న అంకురార్పణంతో ఈ పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా శ్రీవారి ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల గానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.

ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. ఆగ‌స్టు 15న పవిత్రాల ప్రతిష్ట, ఆగ‌స్టు 16న పవిత్ర సమర్పణ, ఆగస్టు 17న పూర్ణాహుతి కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో ప‌విత్రోత్స‌వాల్లో ఆగ‌స్టు 14న అంకురార్ప‌ణ కార‌ణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ ర‌ద్ధు చేసింది. అదేవిధంగా, ఆగ‌స్టు 15న తిరుప్పావడతోపాటు ఆగ‌స్టు 15 నుండి 17వ తేదీ వ‌ర‌కు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది.

తొండమాన్ పురం శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

తొండమాన్ పురం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జ‌రుగ‌నున్నాయి. ఆగస్టు 16న సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పరణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా ఆగస్టు 17న ఉద‌యం పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, ఆగ‌స్టు 18న ఉద‌యం పవిత్ర సమర్పణ, సాయంత్రం చ‌తుష్టానార్చ‌న నిర్వ‌హిస్తారు. ఆగస్టు 19న ఉద‌యం మహా పూర్ణాహుతి, ప‌విత్ర విత‌ర‌ణ‌, స్న‌ప‌న‌తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. అనంత‌రం సాయంత్రం ప్రాకార ఉత్స‌వం, ఆస్థానం చేప‌డ‌తారు. ఈ సంద‌ర్భంగా టీటీడీ హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

ఆగస్టు 13వ తేదీ వెంగమాంబ 207వ వర్ధంతి ఉత్సవాలు

శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 207వ వర్ధంతి ఉత్సవాలు ఆగస్టు 13వ తేదీ తిరుమల, తిరుపతి, తరిగొండలో ఘనంగా జరుగనున్నాయి. వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఆగస్టు 13వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీలక్ష్మీనృసింహస్వామివారికి కల్యాణోత్సవం, తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో హరికథ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తిరుపతి ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద ఉన్న తరిగొండ వెంగమాంబ విగ్రహానికి ఆగస్టు 13వ తేదీన ఉదయం 9 గంటలకు టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం శ్వేత భవనంలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ హాల్ లో ఉద‌యం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సాహితి సదస్సు నిర్వహించనున్నారు. తరువాత అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 5.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 13వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బృందావనంలో టీటీడీ ఉన్నతాధికారులు పుష్పాంజలి సమర్పించనున్నారు.

About amaravatinews

Check Also

డైరెక్టర్ ఆర్జీవీకి మరో తలనొప్పి.. ఈసారి రంగంలోకి సీఐడీ.. విచారణకు హాజరయ్యేనా…

2019లో రామ్‌గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో ఓ సినిమా తీశారు. ఆ మూవీపై తెలంగాణ హైకోర్టులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *