ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం నుంచి తీపికబురు అందింది. రాష్ట్రానికి సాకి (స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్) కింద నిధులు ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో తొలి విడతగా రూ.1,500 కోట్లు విడుదల చేశారు.. ఆర్థిక కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ఏయే మార్గాల్లో నిధులు రాబట్టాలన్నదానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేందుకు ఉన్న అన్ని మార్గాలపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రెండుసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడిన సంగతి తెలిసిందే.
తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వెళ్లి నిధుల కోసం ప్రయత్నాలు చేశారు. మరోవైపు కేంద్రం అన్ని రాష్ట్రాల్లో మూలధన వ్యయం పెరిగే విధంగా ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. కేంద్రం దీని కోసం నిధులు ఇస్తుంది.. దాదాపు 50 ఏళ్ల పాటు ఎలాంటి వడ్డీ చెల్లించనవసరం లేకుండా కేంద్రం రుణం రూపంలో ఈ నిధులను సమకూరుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద రాష్ట్రానికి రూ.2,200 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. సాకి కింద రూపొందించిన విధివిధానాల ప్రకారం రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపితే కేంద్రం ఆమోదిస్తుంది.