విశాఖపట్నం.. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరం మాత్రమే కాకుండా టూరిస్ట్ డెస్టినేషన్ కూడా అనే సంగతి తెలిసిందే. విశాఖ బీచ్, అరకు అందాలను చూడటానికి ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వైజాగ్ వస్తుంటారు. దేశం నలుమూలల నుంచి విశాఖ వస్తోన్న పర్యాటకుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అనేక సదస్సులకు కూడా నగరం వేదికగా మారుతోంది. దీంతో విశాఖ నగరంలో ఫైవ్ స్టార్ హోటళ్లకు డిమాండ్ పెరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే విశాఖ నగరంలోని ఐకానిక్ తాజ్ గేట్ వే హోటల్‌ను కూల్చివేసి దాని స్థానంలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించనున్నారు. తాజ్ గేట్ వే హోటల్‌ను 2018లో ఓరియెంటల్ హోటల్స్ లిమిటెడ్ నుంచి రూ.120 కోట్లకు వరుణ్ గ్రూప్ సొంతం చేసుకుంది. ఇక్కడ 24 అంతస్థుల ప్రీమియం ఆఫీసు స్పేస్, హోటల్ కమ్ స్టూడియోను నిర్మించడానికి సన్నద్ధం అవుతోంది. ఇందుకోసం వరుణ్ గ్రూప్ రూ.600 కోట్లు వెచ్చించనుంది. దీని పక్కనే ఉన్న నోవాటెల్ హోటల్ కూడా వరుణ్ గ్రూప్‌కు చెందినదే. రూ నవంబర్ 14వ తేదీ నుంచి గేట్ వే హోటల్ కూల్చివేత పనులు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. ఇప్పుడు కట్టబోయే హోటల్ నుంచి సాగర తీర అందాలను వీక్షించడానికి అవకాశం ఉంటుంది. విశాఖ బీచ్ రోడ్‌లో ఇదే తొలి స్క్రై స్క్రాపర్ కానుండటం విశేషం.
తాజ్ గేట్ వే హోటల్‌ను మొదట్లో సీ పెరల్ హోటల్‌గా వ్యవహరించేవారు. తర్వాత ఇది తాజ్ హోటల్ అయ్యింది. ప్రస్తుతం గేట్ వే హోటల్‌గా ఉంది. ఈ హోటల్‌ను త్వరలోనే కూల్చేస్తారని సెప్టెంబర్లోనే వార్తలొచ్చాయి. ఇప్పుడు అది కార్యరూపం దాల్చనుంది.