ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తన వ్యక్తిగత భద్రతను తగ్గించారంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన వైఎస్ జగన్.. పిటిషన్‌లో సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్ తరుఫున ఆయన న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈ పిటిషన్‌లో తనకు గతంలో ఉన్న సెక్యూరిటీని కొనసాగించాలని వైఎస్ జగన్ కోరారు. జూన్ 3వ తేదీ నాటికి తనకు ఉన్న భద్రతను పునురద్ధరించేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని వైఎస్ జగన్ పిటిషన్‌లో కోరారు. కేంద్ర ప్రభుత్వం గతంలో తనకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించిందని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. గతంలో తనకు 139 మంది భద్రతా సిబ్బంది ఉన్నారన్న వైఎస్ జగన్.. ప్రభుత్వం దీనిని 59కి కుదించిందని పేర్కొన్నారు.
అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం తనను అంతమొందించడమే లక్ష్యంగా పెట్టుకుందని పిటిషన్‌లో ఆరోపించిన వైఎస్ జగన్.. ప్రాణహాన్ని ఉన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా భద్రత తగ్గించిందని పేర్కొన్నారు. భద్రత తగ్గింపు విషయమై తనకు కనీసం సమాచారం ఇవ్వలేదని వైఎస్ జగన్ ఆరోపించారు. గతంలో తనకు ఉన్న భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే వైఎస్ జగన్ ఆరోపణలను పోలీసులు, ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. ముఖ్యమంత్రి హోదాలో అదనంగా ఇచ్చే భద్రతను మాత్రమే కుదించినట్లు తెలిపాయి. రూల్స్ ప్రకారమే వైఎస్ జగన్‌కు భద్రత కల్పిస్తున్నామన్న ప్రభుత్వ వర్గాలు.. ముఖ్యమంత్రి స్థాయి భద్రత కల్పించడం వీలుకాదని స్పష్టం చేశాయి. మరోవైపు వైఎస్ జగన్ పిటిషన్ రెండు రోజుల్లో హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు వైఎస్ జగన్ వినుకొండ పర్యటన సందర్భంగానూ వైఎస్ జగన్ భద్రత గురించి చర్చ జరిగింది. ఫిట్‌నెస్ లేని వాహనం కేటాయించారని ఆరోపిస్తూ.. వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలేసి వేరే కారులో వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వం కేటాయించిన వాహనం పదే పదే ఆగిపోతోందని ఆరోపిస్తూ.. వైఎస్ జగన్ వేరే కారులో వినుకొండ వెళ్లడం మీద అప్పట్లో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం నడిచింది. అయితే దీనిపైనా అప్పట్లో ప్రభుత్వ అధికారులు క్లారిటీ ఇచ్చారు. కండీషన్‌లో లేని వాహనాన్ని ఇచ్చారనే ఆరోపణలను తోసిపుచ్చిన అధికారులు.. వైఎస్ జగన్ భద్రతను సైతం తగ్గించలేదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.