పిలిచి సీటిచ్చిన వైఎస్ జగన్‌కు షాకిచ్చిన కృష్ణయ్య.. అసలు కారణాలు ఇవేనట..

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ ఆర్. కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్. కృష్ణయ్య.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం రాజీనామా చేసిన కృష్ణయ్య లేఖను రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు అందజేశారు. ఆర్. కృష్ణయ్య రాజీనామాకు రాజ్యసభ ఛైర్మన్ మంగళవారం ఆమోదం తెలిపారు. మరోవైపు ఆర్. కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ బలం 8కి పడిపోయింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది సభ్యులు ఉండేవారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ముగ్గురు సభ్యులు తమ పదవులు రాజీనామా చేశారు. బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్. కృష్ణయ్య తమ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో.. వైసీపీ బలం 8కి పడిపోయింది.

మరోవైపు ఆర్. కృష్ణయ్య గతంలో టీడీపీ నుంచి ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే 2018 ఎన్నికల్లో టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన కృష్ణయ్య.. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే బీసీ నేత కావడం, బీసీ హక్కుల కోసం పోరాడుతూ ఉండటంతో 2022 లో వైఎస్ జగన్.. ఆర్. కృష్ణయ్యకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చారు. అయితే పదవీకాలం మరో నాలుగేళ్లు ఉండగానే ఆయన తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరోవైపు ఆర్. కృష్ణయ్య తెలంగాణ బీజేపీలో చేరతారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

అయితే బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు రాజీనామా చేసినట్లు ఆర్. కృష్ణయ్య తెలిపారు. వంద బీసీ కుల సంఘాలతో చర్చించిన తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్న కృష్ణయ్య.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోందని అన్నారు. 9 నెలలు గడిచినా ఇప్పటికీ రిజర్వేషన్లు పెంచలేదన్న కృష్ణయ్య.. బీసీ ఉద్యమం కోసం పదవిని త్యాగం చేసినట్లు తెలిపారు. తెలంగాణలో బీసీ ఉద్యమం పతాక స్థాయికి చేరిందని కృష్ణయ్య తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఉంటూ.. బీసీ రిజర్వేషన్లకు మద్దతిచ్చే పార్టీలో కలిసి పనిచేస్తానని ప్రకటించారు.

About amaravatinews

Check Also

ఈ సారి భారతరత్న దక్కేది ఎవరికి? రేసులో ముందున్న ఆ ఇద్దరు..!

రిపబ్లిక్ డే వేళ భారతరత్న ఈ సారి ఎవరికి ఇవ్వబోతున్నారన్న చర్చ మొదలయ్యింది. గత ఏడాది భారతరత్న చరిత్రలోనే అత్యధికంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *